పని ఒత్తిడి నుంచి కాస్త దూరంగా . బ్యాక్ ప్యాక్ తో వారం రోజుల పాటు సరికొత్త ప్రాంతాలకు వెళ్లడం ఈనాటి అమ్మాయిలకు అలవాటే.
కుటుంబ సభ్యులతో కాకుండా ఇతర స్నేహితులతో కలిసి వెళ్లడం , ఒంటరి ప్రయాణాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
కొత్త విషయాలు ఎన్నో నేర్పిస్తాయి. అయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలో చిక్కుకోకుండా, ప్రమాదాలకు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించి గూగుల్ లో సమాచారం తెలుసుకుంటూ ఉంటాం కానీ భద్రత కోణంలో చూస్తే ఆ సమాచారం ఏమాత్రం సరిపోదు.
ఎందుకంటే నెట్ ,టూర్ గైడ్ ల్లో ఉండే ప్రాంతాలు ఊరికి ఒక్కోసారి చివర్లో విసిరేసినట్టుగా ఉండొచ్చు.
సాయంత్రం బయలుదేరితే అక్కడికి చేరుకునేసరికి చీకటి పడవచ్చు కాబట్టి అక్కడి జనాలు ఎక్కువగా ఉండే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
కొత్త ప్రాంతంలో ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడం కన్నా ఎక్కడికి వెళ్ళకూడదు గ్రహించడం చాలా ముఖ్యం.
కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలకు అడ్డాగా ఉంటాయి వాటి దగ్గరికి కూడా వెళ్లకపోవడం మంచిది.
అందుకే మీరు వెళ్లాల్సిన ప్రాంతానికి అంతకంటే ముందు ఎవరైనా స్నేహితులు వెళ్లి ఉంటే వారి నుంచి కొంత సమాచారం తీసుకోండి.
అక్కడికి దగ్గరలో ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి. మీరు చెకింగ్ చేసే హోటళ్లలో మీకు విషయాలు చెబుతారు.
ఓ కొత్త ప్రదేశానికి వెళితే మనం పర్యాటకులము అనే విషయం అందరికీ తెలిసేలా నడుచుకో కూడదు.
ఎప్పుడూ కెమెరాలు , మ్యాప్ చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండకూడదు.
అవసరం లేనప్పుడు వాటిని బ్యాక్ ప్యాక్ లో ఉంచుకోండి.
వీలుంటే స్థానికంగా అమ్మాయిలు వేసే డ్రెస్ వేసుకోండి .
ఇవన్నీ మీపైఅనవసరమైన ఆసక్తి ఏర్పడకుండా రక్షిస్తాయి.
పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మీకు మీరే గిరి గీసుకోవడం మంచిది.
కేవలం మీరు చూడాలనుకున్న ప్రాంతానికి మాత్రమే చూస్తూ ఫోటోలు తీస్తూ ఉండండి.
దాన్ని దాటి ఇంకేదైనా ఆసక్తిగా కనిపిస్తే అలా వెళ్ళి పోతే దారి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ప్రయాణానికి ముందే మీ బ్యాక్ ప్యాక్ లో ఐడి కార్డు ,క్రెడిట్ ,డెబిట్ కార్డులు ముఖ్యమైనవి స్కాన్ చేసుకుని మెయిల్ చేసుకోండి.
ఒకవేళ మీ బ్యాక్ ప్యాక్ దొంగతనం అయితే సాయపడతాయి.
అంతేకాకుండా మీరు దిగిన ఫోటో, హోటల్ ఫోన్ నెంబర్ , పోలీసులు, అత్యవసరమైన నెంబర్లు మీ దగ్గర ఉంచుకోవడం మర్చిపోవద్దు.