‘అమ్మ’ . . . నీ ఆరోగ్యం జాగ్రత్త. . .

Published on August 31, 2019

  అమ్మ . . .!

  ఒక్కమాట –  నీలా ఆకలికి ప్రేమలు తెలియవు. చెంబుడు నీళ్లు తాగి కడుపు నిండి పోయిందని సర్దుకుపోవడం తెలియదు. ఆకలి నీలోని శక్తిని తినేస్తుంది. మెల్లమెల్లగా నిన్నే మింగేస్తోంది. అప్పుడు నువ్వు ఉండవు . నీ  పిల్లలకు చందమామ లాంటి గుండ్రటి రొట్టెలు ఉండవు.

  కొన్నిసార్లు మూడురొట్టెలు ఉంటాయి. నీతో కలిపి నలుగురు ఉంటారు. అలాంటప్పుడు ఆకలి లేదు అని మాత్రం అనొద్దు ప్లీజ్. ఉన్న రొట్టెలన్ని కలిపి  నాలుగు భాగాలు చెయ్యి. దీనివల్ల నలుగురి కడుపు నిండకపోవచ్చు. కానీ నలుగురి ఆకలి తీరుతుంది. నీకు కూడా రేపటి బాధ్యతలకు సరిపడా సత్తువ సమకూరుతుంది.

ఓ మహిళ పెనిమిటి సేవలో, బిడ్డల ప్రేమలో, వంటగదిలో,ఇంటి పనిలో, లక్ష్యాల గురించి, లక్షల సంపాదనలో నిన్ను నీవు మర్చిపోతున్నావు. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ.

అమ్మ నీ కడుపుకి భోజనం కావాలి. నీ శరీరానికి వ్యాయామం కావాలి. నీ కంటికి నిద్ర కావాలి. నీ గుండెకు శ్వాస కావాలి. నీ మెదడుకు విశ్రాంతి కావాలి. ఇవన్నీ అత్యవసరం.

 • నువ్వు కుటుంబమే ప్రపంచం అనుకునే గృహిణి కావచ్చు ,  ప్రపంచాన్ని గెలవాలి అనుకునే  కెరీర్ మహిళవి  కావచ్చు. ఎవరైతేనేం అమ్మ గానో, కార్పొరేట్ నారీ గాను నీకంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి.
 • పిల్లలు, చదువులు, పెళ్లిళ్లు, ప్రమోషన్లు, వ్యాపారాలు, అంతర్జాతీయ గుర్తింపు ఏం సాధించాలన్నా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.
 • నీ కోసం, నీ లక్ష్యాల కోసం అయినా ఆరోగ్యంగా జీవించు. ఆరోగ్యాన్ని ప్రేమించు.
 • తల్లి నీ బలం నీకు తెలియదు. నీ మనోశక్తి నీకు అర్థం కాదు. ధైర్యంగా ఉండు. ధైర్యంగా పోరాడు.
 • నీ మనసు సున్నితమే కాని, నీ సంకల్పం వజ్ర సమానం.

కాసేపు మీకోసం:

 • మహిళగా మీ జీవితం ఇన్నాళ్లు పిల్లల చుట్టూ , భర్త చుట్టూ తిరిగింది. కనీసం ఇప్పటి నుంచి అయినా మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి .
 • యోగా, ధ్యానం, ప్రాణాయామం ,వ్యాయామం, నడక జీవితంలో భాగం చేసుకోండి.
 • పోషకాహార నిపుణుల సలహా ప్రకారం మీ భోజన విధానాన్ని మార్చుకోండి.

మానసికం గా . . .

 • లేనిపోని ఆలోచనతో మనసు పాడు చేసుకోవద్దు. నువ్వేం ఆలోచించాలి అన్నది నువ్వే నిర్ణయించుకో. ఎందుకంటే ఆరోగ్యం శరీరానికే కాదు, మనసుకు సంబంధించింది.
 • ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటల్లో చెప్పాలంటే ఆరోగ్యం అంటే మానసిక, శారీరక, భావోద్వేగ నియంత్రణ.
 • అప్పుడే మీ  కుటుంబానికి, మీ వృత్తి కి  , మీ ఉద్యోగాలకు న్యాయం చేయగలరు. సమాజంలో నీ స్థానాన్ని నిలబెట్టుకో గలవు.
 • ఆరోగ్యవంతమైన మనసే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేస్తుంది. నువ్వు ఒంటరి దానివి కాదు. ఓ కుటుంబం మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది.
 • నీ మానసిక ఆరోగ్యం ప్రభావం పిల్లల మీద పడుతుంది.
 • మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి పిల్లలకు కూడా సరిగ్గా అలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి.
 • నీ మానసిక ఆరోగ్యం జీవిత భాగస్వామితో నీ  సంబంధ బాంధవ్యాలను నిర్ణయిస్తుంది. ఉన్నత ఉద్యోగిగా ఓ సంస్థ మనుగడను నిర్ణయిస్తుంది.
 • అర్ధంలేని అనర్ధాలు , ఎందుకో తెలియని చికాకు , లేనిపోని భయాలు, ఆత్మహత్య ఆలోచనలు, మనసు గాడితప్పినట్టు  ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే మంచి సైకాలజిస్టు ని   సంప్రదించాలి. 
 • మానసిక వైద్యం చేయించుకోవడం దౌర్భల్యం కాదు . దౌర్బల్యాన్ని గెలిచే సాహసం.

ఆరోగ్య బీమా:

 • అనారోగ్యం అనుకోని అతిధి లాంటిది. చెప్పాపెట్టకుండా వచ్చి పడుతుంది . అయినా మనం సిద్ధంగా ఉండాలి. మానసికంగానే కాదు ఆర్థికంగా కూడా.
 •  లక్షలకు లక్షలు పోగేసుకుని ఉండాల్సిన పనిలేదు .ఆరోగ్యభీమా చేయించుకుంటే చాలు.
 • ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే కుటుంబానికి అంత పనికొస్తుంది .ఇప్పటిదాకా మీకు ఆరోగ్య బీమా లేకపోతే వెంటనే ఏజెంట్ తో  మాట్లాడండి. 
 • ప్రేమ కానుక గా శ్రీ వారికి ఒక మనవి. వాలెంటైన్స్ డే, పెళ్లి రోజు, పుట్టిన రోజు కానుకలగా  నగ,నట్ర ఇవ్వడం కాదు. ఈసారి అత్యాధునికమైన ఆసుపత్రిలో వైద్య పరీక్షల ప్యాకేజీని శ్రీమతికి బహుమతిగా ఇవ్వండి .
 • ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాథమిక దశలోనే తెలిసిపోతుంది. చికిత్స సులభం అవుతుంది.
 • ‘ప్రాణానికి మించిన ప్రేమ కానుక’ ఏముంటుంది.
 • ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
 • ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి .ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయాలి.
 • అనారోగ్యాన్ని తట్టుకుని మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండటం కూడా ఆరోగ్యవంతుల లక్షణమే .

కొత్తగా కొత్త భాష నేర్చుకోండి :

 • వారాంతపు క్లాసులకు వెళ్లి కొత్త కోర్సులు చేయండి .
 • పెళ్లి తర్వాత అటకెక్కిన డిగ్రీని పూర్తి చేయండి .
 • మీ కెరీర్ కు పనికి వచ్చే నైపుణ్యాలు సంపాదించుకోండి.
 • మీలోని కలలకు పెట్టండి. మీలోని కళలను సాన పెట్టండి .
 • వీటన్నిటి వల్ల జీవితంలోని పాతధనం మటుమాయం అవుతుంది.
error: Content is protected !!
Enjoyed this video?
mother health
"No Thanks. Please Close This Box!"