ఎస్ . పి. బాల సుబ్రహ్మణ్యం గారి కోసం దర్శకుడు సుకుమార్…

Published on September 26, 2020

ఎస్ . పి. బాల సుబ్రహ్మణ్యం గారి కోసం దర్శకుడు సుకుమార్ బాధతో వ్రాసిన ఈ మాటలు మన తెలుగు ఫ్రెండ్ ఆడియన్స్ కోసం. ఈ మాటలు ఎంతో కదిలించాయి. పాట భూమి మీద ఉన్నంత వరకు, ఈ ప్రకృతి లో పాట రూపంలో  ఎస్ . పి. బాల సుబ్రహ్మణ్యం గారు మనతోనే ఉంటారు .

అదేంటో…
రాసుకున్న ప్రతీమాట
మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది..
ఒక్క పాటేంటి..
ప్రతీ వాక్యం, కథా, నవల ఏదైనా సరే..
వాటి గొంతు మాత్రం మీదే..
అంతలా మాలో అంతర్భాగమైపోయింది.. మీ గాత్రం
మీ పాటలు వింటూనో..
మీ రాగాలు హమ్‌ చేస్తూనో..
మీ గాత్రమాధుర్యం గురించి చర్చిస్తూనో..
ఎన్నో గంటలు.. కాదు..
రోజులు, సంవత్సరాలు బతికేశాం.. బతికేస్తాం..
ఆ రోజులన్నీ మీవే కదా..
మీరు మాతో గడిపినవే కదా..
అంటే ఒకే రోజు కొన్ని కోట్ల రోజులు బతకగల నైపుణ్యం మీది..
ఇంకా మీకు మరణం ఏంటి..??
మరణం పిచ్చిది..
పాపం తనొచ్చాక మీరుండరని అనుకుంది..
ఇలా వచ్చి..
అలా చేయి పట్టుకుని తీసుకెళ్లి పోవచ్చు అనుకుంది.
కానీ ఎక్కడ చూసినా మీరే,
ఎక్కడ విన్నా మీ పాటే..
మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే..
మా హృదయాలలో..
మా అంతరంగాలలో..
అజరామరమైన మిమ్మల్ని..
ఎలా తీసుకెళ్లాలో దానికర్థంకాలేదు..
మిమ్మల్ని తీసుకెళ్లడమంటే..
ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికర్థమైంది..
మొదటిసారి మరణం ఒంటరైంది.
ఏం చేయాలో తెలియక.. బిత్తర చూపులు చూస్తోంది..
దిక్కుతోచక భోరున ఏడుస్తోంది..
‘మృతిలో తలదాచుకున్న బతుకు..
శృతిలో కలిపింది నిన్ను జతుకు..
మళ్లీ మీ పాటే దానికి ఓదార్పు..
పోన్లెండి బాలు సార్‌..
ఈసారికి దాన్ని క్షమించేయండి..
ఇంకెప్పుడూ రాదులేండి..
(‘‘మరణంతో నిజమయ్యే ఈ బతుకు.. ఒక కలయేలే..
కల నిజాల సంధిరేఖ కలిసిపోవు నీలోనే..’’ ఎప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి..
అది కూడా మీ గొంతుతోనే) – సుకుమార్‌

#SPBalasubrahmanyam, SPBalasubrahmanyam, #SPB

 

error: Content is protected !!
Enjoyed this video?
#SPBalasubrahmanyam
"No Thanks. Please Close This Box!"